ఆసుపత్రి ఉంది..సిబ్బంది లేరు-ఆదివాసీలకు వైద్యం అందేదెప్పుడు?

క్వార్టర్స్ ఉన్నా..విధులకు దూరం—చల్పాక పీహెచ్సీలో నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
ఈ69న్యూస్,చల్పాక,ఏటూరునాగారం, సెప్టెంబర్ 2
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత కారణంగా ఆదివాసీ గిరిజనులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం ముగ్గురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు.చల్పాక పీహెచ్సీకి ఎలిశెట్టిపల్లి, బన్నాజీబంధం, చల్పాక, వీరాపురం, అల్లంవారిఘనపురం, బోచెరువు, గుర్రాలబావి, గుండెంగవాయి తదితర మారుమూల ఏజెన్సీ గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. అయితే సిబ్బంది కొరతతో అనేక వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు సకాలంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

“ఇల్లు ఉంది.. ఇల్లాలు లేదు” అన్న చందంగా ఆసుపత్రి సిబ్బందికి క్వార్టర్స్ సదుపాయం ఉన్నప్పటికీ వారు అక్కడ ఉండడం లేదని, విధులకు కూడా సమయానికి హాజరుకావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో పీహెచ్సీకి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, వైద్యశాఖ ఉన్నతాధికారులు చల్పాక పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.సిబ్బంది హాజరు, విధుల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించి, నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, పీహెచ్సీలో నిరంతరం వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆదివాసీ గిరిజనులకు వైద్యం హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించి చల్పాక పీహెచ్సీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
