
ఆగస్టు 14 నుంచి దేవాదుల రిజర్వాయర్ల ద్వారా నీటి విడుదల: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 8 (E69NEWS)
ఘనపూర్ రిజర్వాయర్ కింద ఉన్న 2,500 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు అవసరమైన కెనాల్స్‌ను నిర్మిస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. రిజర్వాయర్ కుడి కాలువను శనివారం నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు.
ప్రస్తుతం కుడి కాలువలో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులను వెంటనే చేపట్టి మూడు రోజుల్లో పంటలకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కాలువకు ఇరువైపులా సైడ్‌వాల్స్ నిర్మించి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శాశ్వత కెనాల్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మూడు నెలల్లో సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
ఘనపూర్ రిజర్వాయర్‌ను దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారని, దీని కింద సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉందని కడియం శ్రీహరి తెలిపారు. కెనాల్స్ ఆధునికీకరణ జరగకపోవడంతో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి కెనాల్స్ నిర్మాణం పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాలువల్లోకి మురుగు నీరు రావద్దు
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీరు పంట కాలువల్లో కలుస్తుండటంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మురుగు నీరు పంట కాలువల్లోకి రాకుండా డ్రైనేజీ వ్యవస్థను రీడిజైన్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వరదనీరు, మురుగునీరు పంట కాలువల్లో కలవకుండా వాగుల్లోకి వెళ్లే విధంగా డ్రైనేజీలు, వరద కాలువలను నిర్మించాలని సూచించారు.
ఆగస్టు 14 నుంచి సాగునీటి విడుదల
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆరుతడి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొందని కడియం శ్రీహరి అన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చిస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.
ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్, అశ్వరావుపల్లి, గండి రామారం, నవాబ్‌పేట రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేస్తూ ఆగస్టు 14 నుంచి నియోజకవర్గంలోని అన్ని దేవాదుల రిజర్వాయర్ల ద్వారా పంటలకు సాగునీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఆగస్టు 14 నుంచి 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి, అనంతరం మరో 15 రోజుల పాటు రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నీటి లభ్యత దృష్ట్యా నిరంతరాయంగా నీటిని విడుదల చేయడం సాధ్యం కానందున ఆన్–ఆఫ్ పద్ధతిలో సాగునీరు అందిస్తామని, రైతులు సహకరించి కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, నీటిపారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఈఈలు, డీఈలు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.