పస్రాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
జల్–జంగల్–జమీన్‌పై రాజీ లేదు.. 1/70, అటవీ హక్కుల అమలుకు ఆదివాసీల సమర శంఖం!
అధికార యంత్రాంగం కానరాలేదు.. హక్కుల కోసం వందలాది ఆదివాసీల కదలికతో పస్రా హోరెత్తింది!
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా చౌరస్తాలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షులు వట్టం ఉపేందర్ ఆదివాసి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గొంది కిరణ్ ఆదివాసి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తుడుం దెబ్బ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జల్–జంగల్–జమీన్ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆదివాసీ అమరవీరులకు జోహార్లు అర్పించి, కొమురం భీమ్ దాదాకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా జాతీయ రహదారిపై నిర్వహించిన ర్యాలీలో ఆదివాసీ యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, మేధావులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయ పాటలు, నృత్యాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఆదివాసీ సంస్కృతి, ఐక్యత, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీ సమాజం కార్యక్రమం నిర్వహించినప్పటికీ అధికార యంత్రాంగం నుంచి తగిన స్థాయిలో ప్రతినిధులు కనిపించకపోవడం పట్ల పలువురు ఆదివాసీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ ఆదివాసి మాట్లాడుతూ, ఆదివాసీ సమాజంలో ఆత్మగౌరవం, హక్కుల కోసం తుడుం దెబ్బ 1994 నుంచి సాగిస్తున్న పోరాటాలను గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలను అవమానించే పదజాలానికి స్వస్తి పలికి, ఆదివాసీ అనే ఆత్మగౌరవ గుర్తింపును మరింత బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. మన భూభాగాన్ని కాపాడుకోవడంతో పాటు ఆదివాసీ బిడ్డలకు విద్య, ఉద్యోగం, సంక్షేమం, ఉపాధి, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన హక్కైన వాటా దక్కేలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా యువత, విద్యార్థులు చైతన్యవంతులు కావాలని కోరారు. ఆదివాసీ విద్య, ఉద్యోగాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. ఆదిలాబాద్ కారిడార్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాల్లోకి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిలిచిపోయిన జీవో నంబర్ 3 విషయంలో ఆదివాసీ ప్రాంతాల ఉద్యోగ హక్కులను పరిరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 1/70, అటవీ హక్కుల చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. ఆదివాసీల భూములను, హక్కులను పరిరక్షించే 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం తదితర చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కులను బలహీనపరిచే ప్రయత్నాలు జరిగితే వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీ అమరవీరులు రాంజీ గోండు, బీర్సా ముండా, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద గొంది రామచందర్, మాదిగ దండోరా జాతీయ నాయకులు దళిత రత్న నెమలి నర్సయ్య మాదిగ, మాజీ సర్పంచులు పాయం నారాయణ, ముద్ద బోయిన రాము, ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడే సాయిబాబు, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు తాటి హన్మంత్, స్థానిక సర్పంచ్ భూక్యా సుమలత, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్, ఆదివాసీ ఎరుకల కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కూరాకుల సమ్మన్న, తుడుం దెబ్బ జిల్లా నాయకులు ఈక జగ్గారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం సురేష్, ఏజెన్సీ మాదిగ మూలవాసి హక్కుల సమితి అధ్యక్షులు లంజపల్లి రాము, ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆలెం భాస్కర్, అన్నేబోయిన కేశవరావు, ఆదివాసీ నాయకపోడ్ దెబ్బ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి ఏర్న ధనుంజయ్, యాలం ఆదినారాయణ, ఈక లక్ష్మణ్, గట్టి సురేందర్, పెండేకట్ల బాలరాజు, మండల ఆదివాసీ సర్పంచులు పెండేకట్ల విజయ, కుంజ శ్రీను, చల్లగుండ జగత్, ప్రకాష్ రెడ్డి, గౌడ హక్కుల సంఘం జిల్లా నాయకులు కందుల తిరుపతి గౌడ్, కంచర్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.