ఐడీఓసీలో ప్రజావాణి–73 దరఖాస్తుల స్వీకరణ
:అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
ఐడీఓసీలో ప్రజావాణి–73 దరఖాస్తుల స్వీకరణ
వచ్చే సోమవారానికల్లా పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలని ఆదేశం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి,సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజావాణికి ప్రజలు ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుండి వస్తారని, వారి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఏమాత్రం జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 73 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు.వీటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తూ, పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం వివిధ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పాత దరఖాస్తులన్నింటినీ వచ్చే సోమవారం నాటికి పరిష్కరించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని, ప్రతి అధికారి ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,ఆర్డీఓ హరికృష్ణతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.