రైతులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా రైతులను పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని బిజెపి జిల్లా నాయకులు కుందు మహేందర్ రెడ్డి విమర్శించారు.కష్టకాలంలో రైతులకు దేవాదుల మరియు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా పంటలకు నీరు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రైతుల బాధలను విస్మరించి గాలికి తిరుగుతున్నారని అన్నారు.
దేవాదుల కెనాల్ ద్వారావరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని చాలా మండలాలకు నీరు అందాల్సి ఉండగా,ఇప్పటివరకు వర్ధన్నపేట మండలానికి చుక్క నీరు కూడా ఇవ్వలేదని తెలిపారు. మండల రైతులను ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.వర్షాలు పడతాయని ఆశతో పంటలు వేసుకొని వేల రూపాయలు ఖర్చు చేసి విత్తనాలు మరియు ఎరువులు కొనుగోలు చేసిన రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతన్నలు బోరున విలపిస్తున్నా పట్టించుకునే నాధుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీన రైతు బీమా పథకం కోసం చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకుండా రైతులకు ఉన్న బీమా సౌకర్యాన్ని కూడా అందకుండా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అన్యాయం చేస్తుందని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఎస్ఆర్ఎస్పి మరియు దేవాదుల నీటిని అందించే విధంగా చర్యలు తీసుకొని రైతన్నల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
లేకుంటే రాజకీయాలకు అతీతంగా రైతన్నలందరినీ కలుపుకొని ధర్నాలు,నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
