విద్యార్థుల్లో లక్ష్యసాధనకు స్ఫూర్తినింపిన సాయిస్పూర్తి కళాశాల ప్రేరణ
సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో గల స్వయం ప్రతిపత్తి సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్, డిప్లొమా, ఔషధ విద్య కోర్సుల విద్యార్థులకు ప్రవేశ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రేరణాత్మక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, ప్రేరణాత్మక వక్త, యోగ సాధకుడు కె.ఎస్.కె. జయదేవ్రావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, అడ్డంకులను అధిగమించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, విద్య ప్రాముఖ్యత, మానవీయ విలువలు, నాయకత్వ లక్షణాలు, సమష్టిగా పనిచేసే తత్వం, సంభాషణ నైపుణ్యాలు, మనోబలం, ఆరోగ్యం, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, వ్యక్తిత్వ వికాసం, సేవాభావం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ ఉన్నత ఆశయాలు, నైతిక విలువలతో విద్యను అభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి, దేశానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, ట్రస్టీ బండి అన్విద దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం మార్గదర్శకాల మేరకు ప్రవేశ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో: డాక్టర్ షేక్ మీరాసాహెబ్, విభాగాధిపతులు, అధ్యాపకులు, జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారి బలుసుపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు