సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపనకు వినతి
వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డికి మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ వినతి పత్రం
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీర సీతారాం నాయక్,ప్రొఫెసర్ సురేష్ లాల్,విశ్వవిద్యాలయ ఆచార్యులు,విద్యార్థి నాయకులు కలిసి వైస్ ఛాన్సలర్‌ను కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇప్పటికే అనేకమంది సంఘసంస్కర్తల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయని,అదే విధంగా బంజారా సమాజానికి ఆరాధ్యదైవంగా,గొప్ప సంఘసంస్కర్తగా నిలిచిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సేవా తత్వం,ఆధ్యాత్మికత,సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన సేవాలాల్ మహారాజ్ ఆశయాలు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు దోహదపడతాయని వివరించారు.బంజారా విద్యార్థి నాయకులు,ఆచార్యుల విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని,గతంలో వైస్ ఛాన్సలర్ ఇచ్చిన హామీ మేరకు విగ్రహ స్థాపనకు అనువైన స్థలాన్ని పరిశీలించి,తగిన చర్యలు తీసుకోవాలని అజ్మీర సీతారాం నాయక్ కోరారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం,ఓఎస్డీ ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి,డాక్టర్ ఇస్తారి,డాక్టర్ రమేష్,డాక్టర్ దీపజ్యోతి,డాక్టర్ రాజు,ఈసీ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్,డీఆర్ శ్రీధర్‌తో పాటు విద్యార్థి నాయకులు డాక్టర్ రాజునాయక్,డాక్టర్ వెంకట్,డాక్టర్ వెంకటేశ్వర్లు, వెంకట్, సుమన్, అశోక్ నాయక్, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన వైస్ ఛాన్సలర్,సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.