కార్యకర్తలకు ధైర్యం నింపిన కేటీఆర్- కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టం
మోసపూరిత రేవంత్ రెడ్డి పోవాలని, 10 ఏళ్లు సురక్షిత పాలన అందించిన కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే, వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాలులో వర్ధన్నపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిర్ ప్రక్రియ,డిజిటల్ మెంబర్షిప్, సోషల్ మీడియా శిక్షణ తరగతులకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి సుమారు 2,500 మంది కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్‌ను, కార్యకర్తలను కేటీఆర్ అభినందించారు.కాంగ్రెస్ పాలనపై విమర్శలుఇందిరమ్మ రాజ్యం వచ్చింది,ఇంటింటా సంక్షోభం తెచ్చింది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పంటల కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి రైతులకు మరణశాసనం రాశారని ఆరోపించారు. ఒకప్పుడు కేంద్రం చెప్తే వినడానికి ‘మోడీ బ్రోకరా’ అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మోడీ చెప్పుచేతల్లో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. ‘మోడీ చెప్పినంతనే పంట కొంటాం అంటున్నాడు. వచ్చే సీజన్ నుంచి రైతుల పంటలు కొనే నాథుడే ఉండడు’ అని అన్నారు.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఉంటే, కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంక్షోభంలో ఉన్నారని అన్నారు. రైతు భరోసా కింద రూ.29,350 కోట్ల బకాయిలు చెల్లించలేదని, బోనస్ కాస్తా బోగస్ అయిందని ధ్వజమెత్తారు.రైతు సమస్యలు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు రాత్రింబవళ్లు కాపలా పడుకొని, వడదెబ్బకు చనిపోతున్నా రేవంత్ రెడ్డికి చలనం లేదని మండిపడ్డారు. దళారులు, రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ అయ్యారని ఆరోపించారు. తెలంగాణ కోసం రాజీనామాలతో చరిత్ర సృష్టించి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు, రైతులు, నిరుద్యోగుల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికలపై ధీమా
‘బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలకపక్షం అవుతుందని ఒప్పుకున్నట్లే’ అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని సూచించారు. ‘ప్రజలు రేవంత్ రెడ్డి పోవాలి – కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు, నిరుద్యోగులు 100 స్థానాల్లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూమి బద్దలైనా మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’ అని ధీమా వ్యక్తం చేశారు.కార్యకర్తలకు భరోసావచ్చే ఐదేళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.’కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అధికారులు ఎన్ని కేసులు పెట్టారో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టం. ఉద్యోగులు రిటైర్ అయినా, ఎక్కడున్నా పట్టుకొచ్చి జైలుకు పంపిస్తాం’ అని హెచ్చరించారు.ధరల పెరుగుదలపై విమర్శరేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్, ఎరువులు, ఆర్టీఏ చార్జీలు, మద్యం ధరలు పెరిగాయని అన్నారు. ‘ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు, రేవంత్ రెడ్డి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల పాలనను ప్రజలు 50 ఏళ్ల వరకు తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది’ అని విమర్శించారు.ప్రాజెక్టులపై వ్యాఖ్యలు
‘రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. కేసీఆర్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం’ అని గుర్తు చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనలేని రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ను ‘మొలకెత్తని’ అంటున్నారని, అదే రైతులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళలోకానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రైతుబంధుపై పోలిక
కేరళ, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయని, కానీ రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు లేవని రేవంత్ అంటున్నారని విమర్శించారు. ‘కేసీఆర్ పాలనలో ఖరీఫ్, రబీ పంటలకు వరి నారు పోసే సమయంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశాం’ అని గుర్తు చేశారు.ఆరురి రమేష్ పిలుపు
మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిర్ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి, ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, టి. రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సతీష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, లలిత యాదవ్‌తో పాటు వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు