టిబి ముక్త భారత్ కార్యక్రమం
క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన టిబి ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా వేలేరు గ్రామపంచాయతీ ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఊపిరితిత్తుల ఎక్స్రే పరీక్షలు నిర్వహించడంతో పాటు పలు రకాల ఆరోగ్య పరీక్షలు కూడా చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, క్షయ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామంలో ఇటువంటి వైద్య శిబిరాలు మరికొన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఈ శిబిరంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీకర్, వైద్యురాలు విశాలి, ఆరోగ్య విస్తరణాధికారి వెంకటేశ్వర్లు, ఆరోగ్య పర్యవేక్షకులు కుమారస్వామి, ప్రభావతి, ఆరోగ్య సహాయకులు కనకమ్మ, ప్రసాద్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది గ్రామ ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు.