పేద విద్యార్థి కలకు కుంజ సూర్య అండ
NIT వరంగల్ సీటు కోసం ఆర్థిక ఇబ్బందులు.. అఖిలకు అండగా నిలిచినా కాంగ్రెస్ పార్టీ నాయకులు
చదువు ఆగకూడదంటూ ముందుకొచ్చిన కుంజ సూర్య.. అఖిల భవిష్యత్తుకు భరోసా
పేదరికం ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన అనుమ నాగేష్–అరుణ దంపతుల కుమార్తె అనుము అఖిల తన ప్రతిభతో ఉన్నత విద్యలో సీటు సాధించినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని ఆమెకు అండగా నిలిచారు. అఖిల తొలుత IIT–జార్ఖండ్‌లో సీటు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు చెల్లించలేక ఆ అవకాశాన్ని కోల్పోయింది. అనంతరం రెండో దశలో NIT వరంగల్‌లో సీటు సాధించింది. అయితే ఈ అవకాశాన్ని కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో దేవులపల్లి విజయకుమార్‌ను సంప్రదించి తమ పరిస్థితిని వివరించారు. విషయం తెలుసుకున్న దేవులపల్లి విజయకుమార్ వెంటనే స్పందించి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్యను సంప్రదించి అఖిల చదువుకు సహాయం చేయాలని కోరారు. స్పందించిన కుంజ సూర్య విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ₹20,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ ₹10,000, పూజారి కిరణ్ కుమార్ యూఎస్ఏ, ఎన్ఆర్ఐ ₹10,000 అందించడంతో మొత్తం ₹40,000 ఆర్థిక సహాయాన్ని అఖిల కుటుంబానికి అందజేశారు. ఈ సహాయాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, దేవులపల్లి విజయకుమార్ చేతుల మీదుగా అఖిల కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఒక విద్యార్థి ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు. అఖిల NIT వరంగల్‌లో ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో మరెందరో పేద విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొండగొర్ల పోషయ్య, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు సర్వ అక్షిత్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు సోదారి రామయ్య, సర్పంచులు కావిరి అర్జున్, పొలబోయిన గోపాల్, ఈసం జనార్దన్, ఉపసర్పంచ్ అనుము లక్ష్మయ్య, తాటి నీలాద్రి, జాడి రమేష్, సప్పిడి రాంబాబు, పొన్న వెంకటనారాయణ, చెన్న శ్రీనివాస్, అత్కూరి ఎల్లయ్య, నేతాజీ, సోదారి కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.