జెండా ఆవిష్కరించిన గండ్ర జ్యోతి
జెండా ఆవిష్కరించిన గండ్ర జ్యోతి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి.బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ జెండాను ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. 2001లో ‘మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు’ అనే నినాదంతో కేసీఆర్ గారు ప్రారంభించిన పోరాటం తెలంగాణ చరిత్రను మార్చివేసిందన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం, ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. పదేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కేసీఆర్ రే శ్రీరామ రక్ష అని అభివర్ణించారు. సాగునీటి రంగంలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను తీర్చారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిందని మండిపడ్డారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దుర్మార్గమని, సింగరేణి కార్మికుల హక్కుల సాధన కేవలం కేసీఆర్ నాయకత్వంలోని టీబీజీకేఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ పట్టణ అధ్యక్షులు,మాజీ చైర్మన్లు,యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.