ములుగు జిల్లాపై కేంద్రం నిర్లక్ష్యం అసహ్యం
ములుగు జిల్లాపై కేంద్రం నిర్లక్ష్యం అసహ్యం
ప్రమాదంలో గిరిజన విద్యార్థుల భవిష్యత్తు
తెలుగు గళం న్యూస్ ములుగు ఏప్రిల్ 28
మేడారం వంటి గిరిజన ప్రాంతంలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం జిల్లా విద్యార్థుల భవిష్యత్తును చీకటిలోకి నెట్టే చర్యగా తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి తీవ్రంగా ఖండించారు.ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉండాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలున్నప్పటికీ, ములుగు జిల్లాను పక్కన పెట్టడం వెనుక కారణాలను భారత ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.ఉత్తర భారత రాష్ట్రాలకు వరుసగా నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తూ, దక్షిణ రాష్ట్రాలపై వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.మేడారం (సమ్మక్క-సారలమ్మ), తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, నూగూరు (వెంకటాపురం), గోవిందరావుపేట వంటి ఏజెన్సీ మండలాల్లో వేలాది గిరిజన విద్యార్థులు నాణ్యమైన ఉచిత నివాస విద్య కోసం ఎదురుచూస్తున్నా ఇప్పటికీ స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లా పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి, మేడారం ప్రాంతంలోనే నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని, లేకపోతే గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు, రహదారి దిగ్బంధనలు చేపట్టి ప్రభుత్వాన్ని కదిలించేందుకు సిద్ధమవుతున్నామని తాటి నీలాద్రి హెచ్చరించారు.గిరిజనుల విద్య, హక్కుల కోసం ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వట్టం జనార్దన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి రాజబాబు, సహాయ కార్యదర్శి వట్టం సురేష్, కోశాధికారి సోలం సురేష్, మండల ఉపాధ్యక్షులు కోరం సుధాకర్, పిట్టల నాగేష్, చాట్ల విజయ్, తాటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.