
కొత్తపల్లి, పామునూర్, ఇప్పగూడెం, చాగల్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన
ఘనపూర్ (స్టేషన్), ఆగస్టు 9 (ఈ69 న్యూస్) జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు అధిక నీటి అవసరం కలిగిన వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి ఎస్. కరుణాకర్ సూచించారు.ఈ మేరకు ఘనపూర్ (స్టేషన్) మండలంలోని కొత్తపల్లి, పామునూర్, ఇప్పగూడెం, చాగల్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు ప్రస్తుత సాగునీటి పరిస్థితులు, నీటి లభ్యత, పంట మార్పిడి, కంటింజెన్సీ పంటల సాగుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ, రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిగణనలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేపట్టి నష్టపోకుండా కందులు, పెసర్లు, అలసందలు, జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటి అవసరం కలిగిన కంటింజెన్సీ పంటల వైపు మళ్లాలని రైతులను కోరారు.అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చని వివరించారు.ఈ గ్రామసభల్లో సంబంధిత గ్రామాల సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.