హత్యలు కాదు..మానవత్వం కావాలి

నేటి సమాజంలో హత్యలు రోజురోజుకూ ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నాయి.దేశంలో ఏదో ఒక చోట హత్య జరిగినట్లు ప్రతిరోజూ వార్తలు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు ఈ హత్యలు? ఎందుకు ఈ కక్షలు, ప్రతీకారాలు? మనిషి ప్రశాంతంగా, శాంతియుతంగా జీవించలేడా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో తలెత్తుతోంది.సమాజంలో జరుగుతున్న హత్యలకు ఒక్కటే కారణం ఉండటం లేదు. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, డబ్బు కోసం హత్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలపై అనుమానాలు, పాత కక్షలు, వ్యక్తిగత ప్రతీకారాలు, రాజకీయ విభేదాలు, గ్యాంగ్ గొడవలు, రౌడీయిజం, మతపరమైన ద్వేషాలు, కుల వివక్ష, పరువు పేరుతో జరిగే హత్యలు వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. నేర గణాంకాల్లో కూడా వివాదాలు, వ్యక్తిగత కక్షలు, లాభాపేక్షతో పాటు కుటుంబ, భూమి, డబ్బు, ప్రేమ వ్యవహారాలు, మతపరమైన కారణాలు, కులవివక్ష, పరువు హత్యలు వంటి అంశాలు హత్యలకు కారణాలుగా నమోదయ్యాయి.కొన్ని సందర్భాల్లో చిన్నపాటి గొడవలు కూడా ప్రాణాలు తీసే స్థాయికి చేరుతున్నాయి. మాట మాటకు గొడవ, ఆవేశం, కోపం చివరకు హింసకు దారితీస్తోంది. మరికొన్ని సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న పాత కక్షలు ప్రతీకార హత్యలకు కారణమవుతున్నాయి.భూమి లేదా ఆస్తి కోసం అన్నదమ్ములు, బంధువుల మధ్యే హత్యలు జరగడం మరింత బాధాకరం.డబ్బు కోసం, అప్పుల విషయంలో, ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదాల కారణంగా కూడా ప్రాణాలు పోతున్నాయి.కుటుంబ కలహాలు కూడా కొన్నిసార్లు దారుణమైన హత్యలకు దారితీస్తున్నాయి.భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల ఆరోపణలు వంటి అంశాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తున్నాయి.కొన్నిచోట్ల ప్రేమ వివాహాలను అంగీకరించకపోవడం లేదా కుటుంబ పరువు పేరుతో యువత ప్రాణాలను బలిగొనడం వంటి పరువు హత్యలు కూడా సమాజాన్ని కలచివేస్తున్నాయి.మతం, కులం, వర్గం పేరుతో ఒక మనిషిపై మరొక మనిషి ద్వేషం పెంచుకోవడం కూడా అత్యంత ప్రమాదకరం. మనిషి పుట్టుకతో ఎవరికీ శత్రువు కాదు. కానీ కులం, మతం, రాజకీయాలు, ఆధిపత్య భావాలు, ద్వేషపూరిత ఆలోచనలు మనుషుల మధ్య గోడలు నిర్మిస్తున్నాయి. ఈ గోడలు చివరకు హింసకు దారితీస్తే దాని నష్టం ఒక్క వ్యక్తికే కాదు.. మొత్తం సమాజానికే.ఇంకొన్ని సందర్భాల్లో నేర ప్రపంచం, గ్యాంగ్ గొడవలు, ఆధిపత్య పోరాటాలు, అక్రమ కార్యకలాపాలు కూడా హత్యలకు కారణమవుతున్నాయి.క్షణికావేశంలో జరిగే హత్యలు కూడా ఉన్నాయి. ఒక చిన్న గొడవలో కోపాన్ని అదుపు చేసుకోలేక తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపానికి గురిచేస్తుంది.మనిషి జీవితం ఎంతో విలువైనది. మనిషి తనంతట తాను ఈ లోకంలోకి రాలేదు.సహజంగా లభించిన ఈ జీవితాన్ని మధ్యలోనే హత్యల ద్వారా ముగించడం వల్ల ఎవరికి ఏమి లాభం? మనం ఈ భూమిపై జీవించేది కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఇంత తక్కువ కాలం ఉండే జీవితంలో కోపాలు, కక్షలు, ద్వేషాలు పెంచుకుని ఒకరినొకరు చంపుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక మనిషి ప్రాణం తీస్తే కేవలం ఒక వ్యక్తి చనిపోడు. అతనిపై ఆధారపడిన కుటుంబం కూడా కుప్పకూలుతుంది.తల్లిదండ్రులు తమ బిడ్డను కోల్పోవచ్చు. పిల్లలు తండ్రిని లేదా తల్లిని కోల్పోవచ్చు. భార్య లేదా భర్త జీవిత భాగస్వామిని కోల్పోవచ్చు. ఒక హత్య ఎన్నో జీవితాల్లో శాశ్వతమైన విషాదాన్ని మిగులుస్తుంది.అందుకే కోపం వచ్చినప్పుడు ఆలోచించాలి..కక్ష వచ్చినప్పుడు వెనక్కి తగ్గాలి..సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి..న్యాయం కోసం చట్టాన్ని ఆశ్రయించాలి. మన చేతుల్లో ఉన్న గొప్ప శక్తి ఇతరుల ప్రాణాలు తీయడం కాదు.. మన కోపాన్ని మనం అదుపు చేసుకోవడం.బతకడం ప్రతి మనిషి హక్కు. మనకు నచ్చని వ్యక్తి అయినా, మనతో విభేదించే వ్యక్తి అయినా అతని ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు.అందరూ బాగుండాలి..అందులో మనం కూడా ఉండాలి.హత్యలు కాదు..మానవత్వం కావాలి.కక్షలు కాదు.. కరుణ కావాలి. ద్వేషాలు కాదు..ప్రేమ కావాలి.హింస కాదు..శాంతి కావాలి.విభేదాలు కాదు..ఐక్యత కావాలి.మనిషిగా పుట్టిన మనం మనిషిలాగే జీవిద్దాం.సమాజాన్ని కాపాడుదాం. తోటి మనిషి ప్రాణాన్ని గౌరవిద్దాం. కక్ష సాధింపులకు, హింసకు, మరణ హోమానికి దూరంగా ఉండి శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలి.
(ముహమ్మద్ సలీం ఈ69న్యూస్ తెలంగాణ బ్యూరో రిపోర్టర్)
