చలో ఐటీడీఏ ఏటూరునాగారం ముట్టడికి శంఖారావం
కొమరం భీం ఆశయాలతో ముందుకు తుడుందెబ్బ – ఆవిర్భావ వేడుకల్లో ఆగస్టు 17 ఐటిడిఏ ముట్టడి కరపత్రాల విడుదల
ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమాల బాట – తుడుందెబ్బ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఆదివాసీల హక్కుల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం 1996 ఆగస్టు 6న ఆవిర్భవించిన తుడుందెబ్బ సంస్థ నేటితో (ఆగస్టు 6, 2026) 30 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం వై జంక్షన్ వద్ద తుడుందెబ్బ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, సంస్థ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా తుడుందెబ్బ ఆదివాసీల భూమి, అడవి, నీటి హక్కులు, ఐదో షెడ్యూల్ అమలు, పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ ఆదివాసీల గొంతుకగా నిలిచిందని పేర్కొన్నారు. కొమరం భీం ఆశయాలైన “జల్–జంగల్–జమీన్” సిద్ధాంతంతోనే సంస్థ ముందుకు సాగుతుందని తెలిపారు. అనంతరం ఆగస్టు 17, 2026న నిర్వహించనున్న “చలో ఐటీడీఏ – ఏటూరునాగారం ముట్టడి” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన, రాజ్యాంగబద్ధ హక్కుల అమలు కోసం నిర్వహించే ఈ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు, యువతకు, మహిళలకు, అన్ని ఆదివాసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని, తుడుందెబ్బ ఉద్యమ స్ఫూర్తిని ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, కార్యదర్శి వట్టం జనార్దన్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి కొమురం లక్ష్మికాంత, జిల్లా అధ్యక్షురాలు పొలిశెట్టి అనసూర్య, మండల అధ్యక్షులు తాటి నీలాద్రి, ఉపాధ్యక్షులు కోరం సుధాకర్, పూనెం నాగేశ్వరావు, చింత లక్ష్మణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.