జర్నలిస్టులపై నారాయణపూర్ సర్పంచ్ బూతుపురాణం-ఎస్సైకి విలేకరుల ఫిర్యాదు

ఈ69న్యూస్ రేగొండ సెప్టెంబర్ 02
ప్రజా సమస్యలపై వార్తలు రాసినందుకు స్థానిక విలేకరులను దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న నారాయణపూర్ సర్పంచ్ గైకోటి రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల విలేకరులు రేగొండ సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.విలేకరుల వివరాల ప్రకారం..నారాయణపూర్ గ్రామంలోని సమస్యలపై గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించి ఆగస్టు 30న పత్రికల్లో వార్త ప్రచురించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న సర్పంచ్ రవీందర్ గత రెండు రోజులుగా విలేకరులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు.సెప్టెంబర్ 1 సాయంత్రం మండల కేంద్రంలోని ఓ బేకరీ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, పలువురు విలేకరుల సమక్షంలో సర్పంచ్ తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, వార్త రాసిన విలేకరి బండి కమలాకర్‌తో పాటు ఇతర జర్నలిస్టులను బహిరంగంగా అవమానించారని తెలిపారు. తనకు అధికార పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.జర్నలిస్టులు తమ విధులు నిర్వహించకుండా అడ్డుకుంటూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విలేకరులు విజ్ఞప్తి చేశారు.