‘తెలుగు గళం’ కథనానికి స్పందన–రేగొండలో పునరుద్ధరించిన చలివేంద్రాలు

ఈ69 న్యూస్, భూపాలపల్లి/రేగొండ, మే 6
రేగొండ మండల కేంద్రంలో చలివేంద్రాల దుస్థితిపై వెలువడిన ‘తెలుగు గళం’ కథనానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం తక్షణ స్పందన చూపింది. ఎండలు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో చలివేంద్రాల్లో నీరు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని “చలివేంద్రం ఉందా.. చనిపోయిందా?” అనే శీర్షికతో ప్రచురించిన వార్త జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ కథనం వెలువడిన కొద్దిసేపటికే అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించారు. మండల కేంద్రంలోని బస్టాండ్, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఉన్న చలివేంద్రాలను పునరుద్ధరించారు. పంచాయతీ సిబ్బంది ఖాళీగా ఉన్న కుండలను శుభ్రపరచి, పైపుల ద్వారా మంచినీటిని నింపి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.చలివేంద్రాల్లో నీటి సౌకర్యం పునరుద్ధరించడంతో ప్రయాణికులు, పాదచారులు, స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘తెలుగు గళం’ పత్రికకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు.ఇకపై వేసవి కాలం ముగిసే వరకు ప్రతిరోజూ చలివేంద్రాలను పర్యవేక్షించి నిరంతరం మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.