ఖరీఫ్‌పై వరుణుడి గండి ఎండిపోతున్న మొలకలు, ఆందోళనలో అన్నదాత
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా మొదలైనా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తొలకరి చినుకులతో పొలాలు దున్ని పత్తి, మొక్కజొన్న, కంది, వరి విత్తనాలు నాటిన రైతులకు ఎండలు శాపంగా మారాయి.
మొలకెత్తి ఎండిపోతున్న పంటలు
తొలి వర్షాలను నమ్మి సాగు చేపట్టిన చోట విత్తనాలు మొలకెత్తినప్పటికీ, తేమ లేక మొక్కలు ఎండిపోతున్నాయి. ఇసుక నేలలు, ఎత్తైన భూముల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.”మొదటి వర్షానికి విత్తనం వేశాం.తర్వాత వాన లేదు. మళ్లీ విత్తనాలు కొనే స్తోమత లేదు” అని పర్వతగిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల్లో వర్షం పడకపోతే నష్టం తప్పదు
వ్యవసాయ నిపుణుల ప్రకారం, మరో వారం రోజుల్లో వర్షాలు కురిస్తే కొంత పంటను కాపాడుకునే అవకాశం ఉంది. లేకపోతే మొదటి విడతలో వేసిన విత్తనాల్లో 70% వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నేలలో తేమ లేక విత్తనాలు పాడయ్యే పరిస్థితి నెలకొంది.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచన
ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో, తక్కువ కాలంలో పండే కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొలకలు దెబ్బతిన్న పొలాల్లో పునర్విత్తనం కోసం స్థానిక అధికారుల సలహాలు తీసుకోవాలని కోరారు.రాయితీలు ఇవ్వాలని డిమాండ్
వర్షాభావం కొనసాగితే విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని, పునర్విత్తనానికి సహాయం అందించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పంట నష్టాన్ని ముందుగానే అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే వరుణుడు ముఖం చాటేయడంతో “నాటుకున్న విత్తనాలు పోయినట్టేనా? ఈ ఏడాది పంటలు పండుతాయా?” అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే అన్నదాతకు ఊరట లభిస్తుంది