విద్యార్థి ప్రాణాలను కాపాడిన వ్యాయామ ఉపాధ్యాయుడు
సమయస్ఫూర్తితో స్పందించిన ఉపాధ్యాయుల సేవలకు మండల విద్యాశాఖాధికారి పొదేం మేనక ప్రశంసలు
ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్థికి సిపిఆర్ పై అవగాహన ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడవచ్చని పిలుపు
ములుగు జిల్లా మంగపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)లో వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేందర్ చూపిన సమయస్ఫూర్తి, ఇతర ఉపాధ్యాయుల సహకారంతో ఒక విద్యార్థి ప్రాణాలను కాపాడిన ఘటన అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఈ నెల 3న పదో తరగతి విద్యార్థి నాగచైతన్య తరగతి గదిలో అకస్మాత్తుగా ఛాతీలో తీవ్ర నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేందర్ విద్యార్థికి అత్యవసర ప్రాణరక్షణ చర్యగా సిపిఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అందించారు. సకాలంలో చేసిన ఈ చర్యతో విద్యార్థి పరిస్థితి మెరుగుపడింది. అనంతరం ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు క్రాంతి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సతీష్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు కలిసి విద్యార్థిని వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. వైద్యుల చికిత్సతో విద్యార్థి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పొదేం మేనక మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ వంటి ప్రాణరక్షణ నైపుణ్యాలపై ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలని పిలుపునిచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించి విద్యార్థి ప్రాణాలను కాపాడిన వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేందర్‌తో పాటు, చికిత్స అందించడంలో సహకరించిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ విద్యార్థి నాగచైతన్య తన ప్రాణాలను కాపాడిన గురువు నాగేందర్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం నాగేందర్ పాఠశాలలో విద్యార్థులకు సిపిఆర్ చేసే సరైన విధానం, గుండెపోటు లేదా శ్వాస ఆగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక ప్రాణరక్షణ చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శనతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు క్రాంతి, ఉపాధ్యాయులు నాగేందర్, వెంకటేశ్వర్లు, సతీష్, వెంకటేశ్వర్ రెడ్డి, అనంతరావు, నాగేశ్వరరావు, రమేష్, అనసూయ, ప్రవీణ, సునీత, రాజు తదితరులు పాల్గొన్నారు.