ఆగస్టు 9న చలో ఏటూరునాగారం
రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఆదివాసుల మహా ఉద్యమం
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తూ భారీ ర్యాలీ – బహిరంగ సభ – ఆగస్టు 17న ఐటీడీఏ ముట్టడి
5వ షెడ్యూల్, జీఓ–3, 1/70, పీసా, అటవీ హక్కుల చట్టాల అమలే ప్రధాన లక్ష్యం
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కేంద్రంలో ఆదివారం ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర జిల్లా సమావేశంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న చేపట్టనున్న “చలో ఏటూరునాగారం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ & సాంస్కృతిక సంఘం, ఆదర్శ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ, బ్లాక్ డే నిరసన కార్యక్రమాలు, అలాగే ఆగస్టు 17న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన రాజ్యాంగ, భూ, అటవీ, స్వయం పాలన హక్కులు నిరంతరం ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనలను సంపూర్ణంగా అమలు చేయడం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జీఓ ఎంఎస్ నెం.3ను పునరుద్ధరించి కఠినంగా అమలు చేయడం, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసి ఆదివాసి భూములను పరిరక్షించడం, పీసా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి గ్రామసభలకు రాజ్యాంగబద్ధ అధికారాలు కల్పించడం, అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న ప్రతి ఆదివాసి రైతుకు హక్కు పత్రాలు అందించడం, అలాగే వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి గిరిజన ప్రజలను దోపిడీ నుంచి రక్షించడం ప్రభుత్వ తక్షణ బాధ్యత అని స్పష్టం చేశారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు, భాష, జీవన విధానం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు అన్ని ఆదివాసి సంఘాలు, ప్రజాసంఘాలు, యువజన, విద్యార్థి, ఉద్యోగి, మహిళా సంఘాలు ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని బ్లాక్ డేగా పాటిస్తూ ఆగస్టు 9న ఏటూరునాగారంలో నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభను చారిత్రాత్మక విజయంగా నిలపాలని, అనంతరం ఆగస్టు 17న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆదివాసుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు యాసం రాజు, రాష్ట్ర కార్యదర్శులు వట్టం జనార్ధన్, చింత కృష్ణ, పాయం జానికిరామ్, మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరం లక్ష్మీకాంత, జిల్లా అధ్యక్షులు చందా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం సురేష్, కోట సంపత్, ఖమ్మం వెంకట్, బిక్షపతి, ఏటూరునాగారం మండల అధ్యక్షులు తాటి నీలాద్రి, తాడ్వాయి మండల అధ్యక్షుడు చంద నవీన్, కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు ఆలం రాంబాబు, చాప లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
