
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రిల్ 21ఈ69న్యూస్:
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై నమోదు చేసిన దేశద్రోహం, యూఏపీఏ తదితర కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో నీలం రామచంద్రయ్య భవన్లో సోమవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు అప్పగిస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై ఆధారాలు లేకుండానే కుట్ర కేసులు నమోదు చేసి, ఎన్ఐఏ ద్వారా నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం వివిధ రకాలుగా వేధింపులకు దిగుతోందని పేర్కొన్నారు.
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ చట్టబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోందని, దోపిడీ విధానాలను బహిర్గతం చేస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావు, ఉమర్ ఖలీద్ తదితరులపై కేసులు నమోదు చేసి తర్వాత ఉపసంహరించుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
పోటు రంగారావు దాదాపు ఐదు దశాబ్దాలుగా విద్యార్థి, యువజన, ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. హింసకు వ్యతిరేకంగా చట్టబద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదని అన్నారు. వెంటనే ఎన్ఐఏ నోటీసులు ఉపసంహరించకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇక ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ ఆయిల్ సంపదపై ఆధిపత్యం కోసం యుద్ధానికి దిగుతున్నారని విమర్శించారు. ఈ చర్యలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తక్షణమే ఆపేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరారు.
సమావేశంలో అమర్లపూడి రాము, జి.లలిత, ఏ.ఎంకన్న, గంటా శ్రీను, అమర్లపూడి శరత్, బీరెల్లి లాజర్, కే.పుల్లారావు, కే.శ్రీనివాసరావు, బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.