
నల్గొండ, జూన్ 22 (e69 న్యూస్): నల్గొండ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం.
మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యా, ఆత్మహత్యా అనే రెండు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల సమాచారం ప్రకారం ఘటనకు ముందు రోజు కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఘటన అనంతరం కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కనిపించకుండా పోవడంతో అతడిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.