
ధర్మసాగర్, ఏప్రిల్ 21 (ఈ69న్యూస్): ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో రైతులకు మద్దతుగా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ట రేణుక మాట్లాడుతూ, రైతులు మార్కెట్కు వెళ్లకుండా గ్రామ స్థాయిలోనే వరి ధాన్యానికి మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు.వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు పడే అవకాశమున్నందున, ధాన్యం తడవకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గ్రామ రైతుల సమస్యలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆయన సూచనల మేరకు ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో బుద్ధె రమేష్, ఈర్ల రాకేష్ మాట్లాడుతూ, రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకువస్తే మద్దతు ధర లభిస్తుందని, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కేంద్రం ద్వారా ప్రభుత్వ మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కూడా లభిస్తుందని తెలిపారు. రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ వల్లపురెడ్డి సంధ్య, రైతు కోఆర్డినేటర్ బుద్ధె రమేష్, వార్డు సభ్యులు రావుల సతీష్ రెడ్డి, గంటె కృష్ణ, ఈర్ల సంధ్య రాకేష్, గ్రామశాఖ అధ్యక్షుడు దుస్స రాజయ్య, నాయకులు పింగిళి బాపిరెడ్డి, వల్లపురెడ్డి రాజిమ్మ రెడ్డి, కొలను మధుకర్, పుట్ట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.