
ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజాసేవకులు
ప్రజలే యజమానులైతే.. ప్రజాసేవకుల పెత్తనం ఎందుకు?
ఓటు కోసం ప్రజల గడప చుట్టూ ప్రదక్షిణలు..గెలిచిన తర్వాత ప్రజలే ప్రజాప్రతినిధుల గడపల చుట్టూ ప్రదక్షిణలు
ప్రజాస్వామ్యంలో అసలైన యజమానులు ప్రజలే. ప్రజల ఓట్లతోనే ప్రజా ప్రతినిధులు పదవులు పొందుతారు. ప్రజలు చెల్లించే పన్నులతో ప్రభుత్వ ఖజానా నిండుతుంది. అదే సొమ్ముతో అధికారులు, ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు. ప్రభుత్వ పథకాలు, కార్యాలయాలు, పరిపాలనా వ్యవస్థ మొత్తం ప్రజల కోసమే ఏర్పడింది. కానీ కాగితాలపై కనిపించే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆచరణలో మాత్రం పూర్తిస్థాయిలో కనిపించడం లేదనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఎన్నికల సమయంలో ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటు అడిగే నాయకులు, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం కొత్త విషయం కాదు. ఓటు వేసే సమయంలో ప్రజలే దేవుళ్లు.. గెలిచిన తర్వాత సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధిని కలవాలంటే అనుచరుల అనుమతి, మధ్యవర్తుల సిఫార్సు, పలుకుబడి ఉన్నవారి సహాయం అవసరమవుతున్న సందర్భాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
ఒక సాధారణ పౌరుడు తనకు రావాల్సిన హక్కు కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడి నుంచే అసలు పరీక్ష మొదలవుతోంది. ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు ఫైలు తిరగాలి. ఒక అధికారి సంతకం కోసం రోజుల తరబడి వేచి ఉండాలి. చిన్న తప్పును సరిచేయించుకోవడానికి పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాలి. ‘సార్ లేరు.. రేపు రండి’, ‘ఫైలు ఇంకా రాలేదు’, ‘ఆన్లైన్లో సమస్య ఉంది’, ‘సంబంధిత అధికారి వద్ద ఉంది’ వంటి సమాధానాలతో సామాన్యుడు నిరాశగా వెనుదిరిగే పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
డిజిటల్ పాలన, ఆన్లైన్ సేవలు, ఒకే చోట ప్రభుత్వ సేవలు అంటూ కొత్త పద్ధతులు వచ్చినా, అనేక చోట్ల ప్రజల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. సర్వర్ పనిచేయడం లేదని, వెబ్సైట్ తెరుచుకోవడం లేదని, బయోమెట్రిక్ పనిచేయడం లేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలను రోజుల తరబడి తిప్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సాంకేతికత ప్రజలకు సౌకర్యంగా మారాల్సిన చోట, సరైన నిర్వహణ లేకపోవడంతో కొన్నిసార్లు అదనపు అవరోధంగా మారుతోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యవర్తుల వ్యవస్థ కూడా ప్రజలకు తలనొప్పిగా మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుడు నేరుగా వెళ్తే పని జరగదనే భావన, ఎవరో ఒకరి ద్వారా వెళ్తేనే పని త్వరగా పూర్తవుతుందనే అభిప్రాయం పెరగడం ప్రమాదకరం. పేదవాడి నిస్సహాయతను, అతడి అత్యవసరాన్ని అవకాశంగా మార్చుకుని లంచాలు, కమీషన్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు రావాల్సిన హక్కు కోసం కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తే అది వ్యవస్థ వైఫల్యం కాదా?
ఇటీవలి కాలంలో లంచాలు తీసుకుంటూ కొందరు అధికారులు అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న పనుల నుంచి పెద్ద కాంట్రాక్టులు, అనుమతులు, బిల్లులు, భూముల వ్యవహారాల వరకు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కొందరు వ్యక్తుల తప్పిదం మాత్రమేనా? లేక అవినీతికి అవకాశం కల్పిస్తున్న వ్యవస్థలోనే లోపాలున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది.
పథకాలు ప్రకటించడం ఒక ఎత్తయితే, అవి నిజంగా అర్హులైన వారికి అందేలా చూడటం మరో ఎత్తు. సంక్షేమ పథకాల జాబితాలో పేరు ఉన్నా ప్రయోజనం అందకపోవడం, అర్హత ఉన్నా పత్రాల పేరుతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం, కొందరికి పలుకుబడితో ప్రయోజనాలు అందుతున్నాయనే ఆరోపణలు రావడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రజల హక్కులు సిఫార్సులు, పరిచయాలు, రాజకీయ అనుబంధాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడకూడదు.
అభివృద్ధి పనుల్లోనూ జవాబుదారీతనం కొరవడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. రోడ్లు నిర్మించిన కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం, నాణ్యతలేని పనులపై ప్రజలు ఫిర్యాదులు చేయడం, కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అయినా సమస్యలు అలాగే ఉండటం వంటి పరిణామాలు తరచూ చర్చకు వస్తున్నాయి. ఒక పని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా అది ప్రజలకు ఎంతకాలం ఉపయోగపడిందనే లెక్క ఎవరు అడుగుతున్నారు? నాణ్యత లోపిస్తే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజాధనానికి జవాబుదారీతనం ఎక్కడ ఉంది?
సమాజంలో మరో ఆందోళనకరమైన పరిణామం ఏమిటంటే, సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికి ప్రాధాన్యం పెరుగుతోందనే విమర్శ. ఒక చిన్న పనికి పెద్ద ఎత్తున ప్రచారం, ప్రారంభోత్సవాలు, ఫొటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ అదే పని పూర్తయిన తర్వాత ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగిందనే సమీక్ష మాత్రం అరుదుగా కనిపిస్తోంది. ప్రజాసేవ ప్రచారం కోసం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరగాలి.
ఫిర్యాదులు చేసే ప్రజలకు కూడా సరైన రక్షణ, స్పందన ఉండాలి. ఒక అధికారి లేదా ప్రజా ప్రతినిధిపై ఫిర్యాదు చేస్తే తమ పని మరింత ఆలస్యం అవుతుందేమోనని భయపడే పరిస్థితి ఉండకూడదు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థతో పాటు, వాటికి నిర్ణీత గడువులో పరిష్కారం చూపించే బాధ్యత కూడా ఉండాలి. ఫిర్యాదుపై చర్య తీసుకోకపోతే సంబంధిత అధికారిని ప్రశ్నించే వ్యవస్థ మరింత బలపడాలి.
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయి వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనం పెరగాలి. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి నుంచి నామినేట్ పదవుల్లో ఉన్నవారి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారులనే విషయాన్ని గుర్తించాలి. అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగి నుంచి అత్యున్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ తమ జీతం ప్రజల సొమ్ము నుంచే వస్తుందనే వాస్తవాన్ని మర్చిపోకూడదు.
అధికారం అనేది ప్రజలపై పెత్తనం చేయడానికి కాదు.. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి. పదవి అనేది సంపాదనకు మార్గం కాదు.. సేవకు అవకాశం. ప్రభుత్వ కార్యాలయం ప్రజలను భయపెట్టే స్థలం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపే వేదిక కావాలి.
ప్రజాస్వామ్యం ఐదేళ్లకోసారి ఓటు వేసే ప్రక్రియతో ముగిసిపోదు. ఎన్నికైన తర్వాత కూడా ప్రజలకు తమ పాలకులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలు అడిగే ప్రశ్నలను విమర్శలుగా కాకుండా, వ్యవస్థను సరిదిద్దుకునే అవకాశంగా చూడాలి.
ప్రజలే యజమానులు.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు ప్రజాసేవకులు. ఈ మౌలిక సత్యం ఆచరణలోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో బలపడుతుంది. యజమాని చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి మారాలి.. సేవ చేయాల్సిన వ్యవస్థ ప్రజల గడపకు చేరాలి. అదే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి.
(ముహమ్మద్ సలీం ఈ69న్యూస్-తెలుగు గళం దినపత్రిక తెలంగాణ స్టేట్ బ్యూరో రిపోర్టర్)