99 రోజుల 'ప్రజా పాలన
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రణాళిక’లో భాగంగా ‘చైల్డ్ సేఫ్టీ’ (బాలల రక్షణ) అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు.ఏప్రిల్ 27 నుండి మే 2వ తేదీ వరకు జరిగే ఈ ప్రత్యేక వారోత్సవాలను పురస్కరించుకుని కిశోర బాలికల సాధికారత కోసం ‘స్నేహ సంఘాల’ ఏర్పాటు ప్రక్రియను జిల్లా అధికారిణి మహేశ్వరి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా అధికారిణి మహేశ్వరి మాట్లాడుతూ బాల్య వివాహాలు సామాజిక అరిష్టమని, మైనర్ వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల శారీరక,మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.చట్టప్రకారం అమ్మాయిలకు 21 ఏళ్లు,అబ్బాయిలకు 23 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కిశోర బాలికలు ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం ఆకుకూరలు,పోషకాహారం మరియు కోడిగుడ్లను తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా నేటి కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలవుతుండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.పిల్లలకు భోజనం తినిపించేటప్పుడు లేదా వారు ఆడుకోవడానికి సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల వారి ఏకాగ్రత లోపించడమే కాకుండా,కంటి చూపు దెబ్బతింటుందని వివరించారు. సెల్ ఫోన్ల ద్వారా సైబర్ నేరగాళ్లు యాప్ల లోని ఓటీపీలను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేసే ప్రమాదం ఉందని, అందుకే పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచి వార్తా పత్రికలు, పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. ఎక్కడైనా బాల కార్మికులు లేదా బాల్య వివాహాలు కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు కాల్ చేసి సమాచారం అందించాలని,మైనర్లను పనుల్లో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాల బారిన పడకుండా గ్రామాల్లో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేగొండ సర్పంచ్ వానరాశి మౌనిక అంజి, ఏపీఎం ప్రేమ్ రాజ్, డీపీఎం వేణుగోపాల్, సీసీ లలిత, హెల్త్ సూపర్వైజర్ సుధాతో పాటు పోలీస్, ఆరోగ్య శాఖల సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.