సీతాఫల్మండి యువకుడి ఘన విజయం
సీతాఫల్మండి యువకుడు దేశసేవకు సిద్ధమయ్యాడు… కఠోర సాధనతో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్‌గా ఎంపికై ప్రాంతానికి యువతకు ఆదర్శంగా గర్వకారణంగా నిలిచిన కాసాని గణేష్‌కు ఘన సన్మానం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే
సికింద్రాబాద్ సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన కాసాని మల్లేష్, శోభ దంపతుల కుమారుడు కాసాని గణేష్ ఇటీవల ఇండియన్ ఆర్మీ అగ్నివీర్‌గా ఎంపికై తన కుటుంబంతో పాటు ప్రాంత ప్రజలకు గర్వకారణంగా నిలిచాడు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన గణేష్, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుతూ దేశసేవే లక్ష్యంగా కృషి చేశాడు.
గత మూడు సంవత్సరాలుగా మైలార్గడ్డలోని మారుతి సంఘంలో కఠిన శారీరక శిక్షణ పొందుతూ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన గణేష్, వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. అతని అంకితభావం, నిరంతర సాధన ఫలితంగానే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్‌గా ఎంపికయ్యాడని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
ఈ సందర్భంగా మారుతి సంఘం చైర్మన్ మట్టకుమార్ ఆధ్వర్యంలో గణేష్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతాఫల్మండి మాజీ కార్పొరేటర్ సామల హేమ గణేష్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనీ. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన గణేష్ క్రమశిక్షణ, కఠోర శ్రమతో ఇండియన్ ఆర్మీకి ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకం అన్నారు. సీతాఫల్మండి ప్రాంతం నుంచి ఒక యువకుడు దేశ రక్షణ బాధ్యతలు చేపట్టబోతుండటం గర్వకారణంగా ఉందని గణేష్‌ను ఆదర్శంగా తీసుకొని మరింత మంది యువత దేశసేవ వైపు అడుగులు వేయాలి” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో కంది నారాయణ, బ్యాంకు రమేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ మురళి, లంబు కుమార్, జ్ఞానేశ్వర్, బీజేపీ నాయకుడు సాయి, బీజేపీ OBC మోర్చా రాష్ట్ర కోశాధికారి రమేష్, అలాగే గణేష్ మిత్రులు పవన్, శివ, అమ్రేష్ తదితరులు పాల్గొని గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.సీతాఫల్మండి ప్రాంతం నుంచి ఇండియన్ ఆర్మీకి ఎంపికైన గణేష్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, దేశసేవ పట్ల అంకితభావం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.