జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కలెక్టరేట్ (ఐడీఓసీ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు,కృషి చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం,దూరదృష్టి,ప్రజల్లో నింపిన చైతన్యం భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.జిల్లా అభివృద్ధి,ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి అని,ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కోరారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ… స్వరాష్ట్ర సాధనలో జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.1969 తెలంగాణ ఉద్యమం నుండి ప్రత్యేక రాష్ట్ర సిద్ధించే వరకు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచి మార్గనిర్దేశం చేశారని గుర్తుచేశారు.ఆ మహనీయుని త్యాగనిరతిని స్మరించుకుంటూ,సమగ్ర జిల్లా అభివృద్ధికి అధికారులు,ప్రజాప్రతినిధులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,డిఆర్వో వసంత కుమారి,ఆర్డిఓ హరికృష్ణ,మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య,వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్,వివిధ శాఖల జిల్లా అధికారులు,మున్సిపల్ కౌన్సిలర్లు,కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.