బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం:సమీక్షా సమావేశంలో గండ్ర దంపతులు
బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం:సమీక్షా సమావేశంలో గండ్ర దంపతులు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి,వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో కలిసి వారు హాజరయ్యారు.రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు,ప్రతి గ్రామం, వార్డులో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా గండ్ర దంపతులు మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి ప్రజల పక్షాన పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వారు కోరారు.ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.