బొగ్గు రవాణాతో వరంగల్‌లో పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలుబొగ్గు రవాణాతో వరంగల్‌లో పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ4 February, 2026E69NEWS

బొగ్గు రవాణాతో వరంగల్‌లో పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు

బొగ్గు రవాణాతో వరంగల్‌లో పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు

వరంగల్ జిల్లాలో బొగ్గు రవాణా కారణంగా ఏర్పడుతున్న పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలపై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బొగ్గు రవాణా, అనుబంధ లాజిస్టిక్స్ వల్ల రహదారి, రైలుమార్గాల్లో కాలుష్యం పెరుగుతోందా? వరంగల్ జిల్లాపై దాని ప్రభావంపై అధ్యయనం చేశారా? దుమ్ము కాలుష్యం తగ్గించేందుకు, ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు ఇవ్వాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు.
ఈ ప్రశ్నకు మంత్రి జి. కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.వరంగల్‌కు సమీపంలోని బొగ్గు గనులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 4 వేల టన్నుల బొగ్గును భూపాలపల్లి గనుల నుంచి ఉప్పల్ రైల్వే సైడింగ్‌కు టార్పాలిన్ కవర్లు వేసిన లారీల ద్వారా సుమారు 56 కిలోమీటర్ల మేర రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు.బొగ్గు రవాణా ప్రభావాలపై EPTRI ద్వారా గాలి నాణ్యత, శబ్ద కాలుష్యం, నీటి నాణ్యత, సామాజిక అంశాలపై అధ్యయనాలు నిర్వహించామని, ట్రాఫిక్ ప్రభావ అంచనా నివేదికలు సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పర్యావరణ అనుసరణ నివేదికలు సమర్పిస్తున్నామని స్పష్టం చేశారు. డ్రైవర్లకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. బొగ్గు రవాణా వల్ల వరంగల్ ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు లేకుండా చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం తెలిపింది.ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య స్పందిస్తూ, కేంద్రం పేర్కొన్న చర్యలు క్షేత్రస్థాయిలో సరిపోతున్నాయా? అని ప్రశ్నించారు. గ్రామాల గుండా వెళ్లే బొగ్గు లారీల వల్ల దుమ్ము మబ్బుల్లా ఎగసిపడుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేవలం కాగితాలపైనే కాకుండా వాస్తవంగా దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *