
చిల్పూర్, ఆగస్టు 6(ఈ69న్యూస్): చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామ రైతుల వద్ద విద్యుత్ కనెక్షన్లు, డీడీలు, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, జీరో బిల్లుల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి గడ్డం సిద్ధయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఎం చిల్పూర్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతులు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ, విద్యుత్ సేవల పేరుతో పలువురు రైతుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల చొప్పున అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. రైతుల నుంచి తీసుకున్న నగదు, గొర్రెలు, మేకలను బాధితులకు తిరిగి ఇప్పించి, సంబంధిత వ్యక్తిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే, రైతుల నుంచి డబ్బులు తీసుకుని ఎలాంటి పనులు చేయకుండా విద్యుత్ సంస్థను మోసం చేసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ గడ్డం సిద్ధయ్యపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఏఈ, ఏడీ, డీఈ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.శుక్రవారం ఏఈ కార్యాలయం ముట్టడికి హెచ్చరికరేపు (ఆగస్టు 7) ఉదయం 11 గంటలలోపు గడ్డం సిద్ధయ్యను సస్పెండ్ చేయకపోతే మధ్యాహ్నం 12 గంటలకు చిల్పూర్ మండల కేంద్రంలోని ఏఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ హెచ్చరించారు.