మొదటి రోజు మండల పరిషత్ లో నడిచిన ప్రజావాణి

నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఎంపీడీఓ(నోడల్ అధికారిని) దారెల్లి కావ్య ఆధ్వర్యంలో సోమవారం మొదటి రోజు ప్రజావాణి కార్యక్రమం సాదాసీదాగ జరిగింది. నోడల్ అధికారిని దారెల్లి కావ్య ను తెలుగుగళం ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ చరవాణి ద్వారా సంప్రదించగా ఆమె స్పందిస్తూ 17 రకాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారని అట్టి సమస్యల పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు ప్రజా వినతులను బదిలీ చేశామని జిల్లా కలక్టర్,జెడ్పీ సీఈఓ కార్యాలయాలకు సమాచారం తెలిపామని అన్నారు.ప్రజావాణి లో అన్ని శాఖల అధికారులు క్రమశిక్షణతో ఉండాలని ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించామని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు అన్ని శాఖల నుండి ప్రాతినిధ్యం ఉండాలని సర్క్యులర్ ఏమ్.ఎస్.సంఖ్య 04 ద్వారా తెలిపినా అదేమి మాకు పట్టదు అన్న చందంగా యధా రాజా తథా ప్రజా అన్నట్టుగా కొన్ని శాఖలు ఆర్&బి,ఉద్యానవనశాఖ, ప్రోహిబిషన్,ఆర్ డబ్ల్యు ఎస్,ఇందిరమ్మ ఇళ్ల ఏఈ,ఇరిగేషన్ శాఖ అధికారులు గతంలో తహశీల్దార్ కార్యాలయంలో డుమ్మా కొట్టినట్లు గానే ఇక్కడ వ్యవహరించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలనే సంకల్పంతో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని శాఖల గైర్హాజరు చేత మచ్చ ఏర్పడుతుందని హాజరైన శాఖల అధికారులు,సిబ్బంది,ప్రజలు బాహాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న దుస్థితి ఏర్పడింది.ఈ కార్యక్రమంలో: తహశీల్దార్ జె.మాణిక్ రావు,విద్యాశాఖాధికారి చల్లoచర్ల వెంకటేశ్వరరావు,వ్యవసాయ శాఖ అధికారి పచ్చల రామ్మోహన్ రావు, వేంసూరు సెక్షన్ విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు,పశువైద్యశాఖాధికారి సఫియా,ఎంపీఓ భూక్యా రంజిత్ కుమార్,వైద్యఆరోగ్య శాఖ నుండి హెల్త్ సూపర్ వైజర్ గనిపిశెట్టి శ్రీనివాస్,ఐకెపి ఏపీఏం సుబ్బారావు,వి.బి.జి.రామ్ జి అధికారి విజయ్,ఐసీడీఎస్ బీరాపల్లి సెక్టార్ సూపర్ వైజర్ ఇజ్జిగాని గంగాజలం తదితరులు పాల్గొన్నారు.
