కాకతీయ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి అవసరంకాకతీయ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి అవసరం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 February, 2026E69NEWS

కాకతీయ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి అవసరం

కాకతీయ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి అవసరం

వరంగల్‌లోని కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆమె లోక్‌సభలో సంస్కృతి శాఖ మంత్రిని ప్రశ్నించారు.వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలను నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ లేదా ఇతర కేంద్ర పథకాల కింద అభివృద్ధి చేస్తున్నారా? గత మూడేళ్లలో కేటాయించిన నిధులు ఎంత? ఆక్రమణలు, నిర్మాణ నష్టం నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై ఎంపీ వివరణ కోరారు.దీనికి సమాధానంగా కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఎనిమిది కేంద్ర పరిరక్షిత స్మారక కట్టడాలు ఉన్నాయని తెలిపారు.వాటిలో వరంగల్‌లోని వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల్ కోట కూడా ఉన్నాయని చెప్పారు.జాతీయ సంరక్షణ విధానానికి అనుగుణంగా ఈ కట్టడాల పరిరక్షణ పనులు నిరంతరం కొనసాగుతున్నాయని, ప్రస్తుతం అవి మంచి స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.తెలంగాణలో స్మారక కట్టడాల సంరక్షణకు 2022–23లో రూ.15.50 కోట్లు, 2023–24లో రూ.14.38 కోట్లు, 2024–25లో రూ.6.80 కోట్లు కేటాయించగా, అందులో రూ.6.77 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. హృదయ్ పథకం కింద వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.2018లో వెయ్యి స్తంభాల ఆలయం వద్ద టైల్ పార్కింగ్, లైటింగ్ సదుపాయాలు కల్పించగా, 2022లో వరంగల్ కోట ఉత్తర ద్వారం, కుష్ మహల్, స్వయంభూ ఆలయ సముదాయం, కీర్తి తోరణం వద్ద ఫసాడ్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.అయితే వరంగల్ స్మారక కట్టడాల కోసం ఎన్ఎంఎంఎ కింద ప్రత్యేక పథకాలు ప్రతిపాదించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఆక్రమణల నివారణకు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేయడం, జిల్లా యంత్రాంగం, పోలీసులతో సమన్వయం చేసుకుని తొలగింపులు చేపట్టడం, భద్రతా సిబ్బంది నియామకం, తరచూ తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.ఈ సమాధానంపై స్పందించిన ఎంపీ డా. కడియం కావ్య, ప్రస్తుతం జరుగుతున్న సంరక్షణ పనులను స్వాగతిస్తూనే, వరంగల్ స్మారక కట్టడాల కోసం ప్రత్యేక కేంద్ర పథకాలు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కాకతీయుల అమూల్య వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు కాపాడటంతో పాటు వరంగల్ పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *