ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి విజయవంతం

ఆదివాసీ హక్కుల కోసం 2 వేల మందితో భారీ ర్యాలీ – ఐటీడీఏ వద్ద ధర్నా
ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఏటూరునాగారంలో చేపట్టిన ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. సుమారు 2 వేల మంది ఆదివాసీలు, యువత, మహిళలు, వివిధ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తారు. ఆగస్టు 17న ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం గతంలోనూ ప్రచురితమైంది. వై జంక్షన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆదివాసీలు చేతుల్లో జెండాలు, డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని “జై ఆదివాసీ”, “జల్–జంగల్–జమీన్”, “జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి”, “1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి” అంటూ నినాదాలు చేస్తూ ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర, జాతీయ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు జీవో నంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలి. ఐటీడీఏలను బలోపేతం చేసి, వాటి ద్వారా ఆదివాసీలకు మరిన్ని అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగ అవకాశాలను స్థానిక ఆదివాసీలకు ప్రాధాన్యతనిస్తూ భర్తీ చేయాలి. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు జీవో నంబర్ 109 ప్రకారం 75 శాతం రిజర్వేషన్ కల్పించాలి. వలస ఆదివాసీలకు అర్హత మేరకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి. ఆదివాసీలు సాగు చేస్తున్న సుమారు 8 లక్షల ఎకరాల పోడు సాగుభూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలి. ఆదివాసీల భూములను అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల భూమి, అడవి, హక్కులు, ఉపాధి, భవిష్యత్తు కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చట్టాలు కాగితాలకే పరిమితం కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అమలయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ధర్నా అనంతరం నాయకులు తమ ప్రధాన డిమాండ్లతో కూడిన మేమోరాండాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సమర్పించారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.“ఆదివాసీల హక్కుల కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం ఒక్కరోజు కార్యక్రమం కాదు… హక్కులు సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని తుడుం దెబ్బ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ అధ్యక్షులు వట్టం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు యాసం రాజు, రాష్ట్ర అధ్యక్షులు గొడెం గణేష్ ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కొమురం లక్ష్మీకాంత, తెలంగాణ రాష్ట్ర భూమిపుత్ర సంఘం పూనెం రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
