కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు

నేటి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
ప్రజా వ్యతిరేక విధానాలపై నేడు నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం కల్లూరు
పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు ప్రతాప్ ల్యాబ్ అధినేత పెడకంటి రామకృష్ణ మీటింగ్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సండ్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుపేదల కష్టాలను కళ్లారా చూసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో లేకపోయినా మానవతా దృక్పథంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని సండ్ర వెంకట వీరయ్య గుర్తుచేశారు. మొదట రూ.50 వేలతో ప్రారంభించిన ఈ పథకాన్ని అనంతరం రూ.1,00,116లకు పెంచి పదేళ్లపాటు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచారని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించడంపై నిర్లక్ష్యం వహిస్తోందని సండ్ర ఆరోపించారు. ఎన్నికల సమయంలో రూ.1,00,116తో పాటు తులం బంగారం, రైతు బంధు పెంపు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కళ్యాణలక్ష్మి పథకంపై హైకోర్టులో స్టే వచ్చినప్పటికీ ప్రభుత్వం వారాలు గడుస్తున్నా కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని సండ్ర మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా పేదలు, మైనార్టీ వర్గాల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించి పేద కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జన్మదిన వేడుకను పురస్కరించుకొని బిఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్,
సొసైటీ మాజీ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు, సొసైటీ మాజీ చైర్మన్ పెద్ద బోయిన మల్లేశ్వరరావు, మాజీ జడ్పిటిసిలు లక్కినేని రఘు, మేకల కృష్ణ, కౌన్సిలర్ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, దార్ల నరసింహారావు, సయ్యద్ ఇంతియాజ్, మహమ్మద్ ఇస్మాయిల్, గ్రామ సర్పంచ్ వేము కృష్ణ, కొరకు ప్రసాద్,మాజీ వార్డ్ సభ్యులు సీనియర్ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉబ్బన వెంకటరత్నం, రావుఫ్, కట్ట ఆర్లప్ప, కళ్యాణ్ కిషోర్, చారుగుండ్ల సందీప్, బొల్లం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి బాలు, అజ్మీర జములయ్య, జానీ మియా, సిహెచ్ కిరణ్, నాయకులు పాల్గొన్నారు.
