సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవ్యవస్థ
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవ్యవస్థ – రైతులకు న్యాయం చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్
తెలుగు గళం న్యూస్ నల్గొండ మే03
నల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, రైతులను పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున విమర్శించారు.రైస్ మిల్లర్ల దోపిడి రోజురోజుకు పెరుగుతోందని, వెంటనే రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలోని ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన ఆయన, కేంద్రాల నిర్వహణ పూర్తిగా గందరగోళంగా ఉందని తెలిపారు. సీరియల్ విధానం పాటించకుండా, ఇష్టానుసారంగా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.‘తాలు’ పేరుతో ప్రతి క్వింటాల్‌కు 2 కిలోల 200 గ్రాములు కోత వేస్తున్నారని, అదనంగా రైస్ మిల్లులకు ధాన్యం వెళ్లిన తర్వాత లారీల వద్ద మరోసారి 5 నుంచి 10 క్వింటాళ్ల వరకు కోత వేయడం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.రైతులు మాట్లాడుతూ – ఒడ్లు ఎండబెట్టడం, ట్రాక్టర్ కిరాయిలు, కోత ఖర్చులు పెరిగిపోవడంతో వ్యయభారం అధికమైందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ₹2369 ఉన్నప్పటికీ, వాస్తవంగా తమకు ₹2000 మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.చందనపల్లి గ్రామంలో 225 మంది రైతులు నమోదు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు 100 మందికి కూడా ధాన్యం లిఫ్టింగ్ జరగలేదని వెల్లడించారు.సుమారు 17 వేల క్వింటాళ్ల ధాన్యం తరలించినప్పటికీ, కొంతమంది రైతుల వద్ద 10 క్వింటాళ్ల వరకు కోత వేయడం అన్యాయమని వాపోయారు.ముషంపల్లి కేంద్రంలో రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించలేని పరిస్థితి నెలకొన్నదని, ట్రక్ షీట్లు కూడా సరిగా నమోదు చేయడం లేదని తెలిపారు.జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని, రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు.జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టాలని, అమ్మిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఉప్పుల గోపాలు, మాజీ ఎంపీటీసీ రూపని లింగయ్య, సిపిఎం నాయకులు గంగుల యాదయ్య, కొడదల బిక్షమయ్య, పాలడుగు ఎల్లయ్య, చిలుముల వెంకన్న, కొంచెం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.