కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య
రైతు సభ కాదు కౌరవ సభ–బిఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతల విమర్శలు
తెలుగు గళం న్యూస్ వరంగల్, మే 3
వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రైతు సభపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య మాట్లాడుతూ, ఇది రైతుల సమస్యల పరిష్కారానికి కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న సభ అని ఆరోపించారు.కౌరవులు వినాశనాన్ని కోరుకున్నట్లే, ఈ సభ కూడా రైతుల క్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదని విమర్శించారు.అధికారంలో ఉన్న సమయంలో రైతులను అరెస్టు చేసి, పోలీసులతో దాడులు చేయించిన చరిత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఆయన అన్నారు. ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి రైతులను అరెస్టు చేసిన ఘటనలను గుర్తు చేశారు.రాజకీయ వారసత్వం కోసం మాత్రమే వరంగల్ జిల్లాలో సభలు నిర్వహిస్తున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు.కుటుంబ ఆధారిత రాజకీయాలతో ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.అలాగే, వరంగల్ జిల్లాను విభజించడం వల్ల అభివృద్ధి వెనుకబడిందని, ఇది గత పాలకుల వైఫల్యమని పేర్కొన్నారు.నీటి కొరత, విద్యుత్ సమస్యలు, కొనుగోలు సమస్యలు వంటి రైతుల ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా, రైతుల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళ మండల అధ్యక్షురాలు ఇల్లందుల ఎలీషా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఎడ్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.