సాగు భూములకు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి

నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలoలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు అందించడంతో పాటు బోర్లు,విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్,ఖమ్మంజిల్లా కమిటి సభ్యులు గాయం తిరుపతిరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం పట్టణంలో గల ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ మండలంలోని పది గ్రామాల్లో గిరిజనులు గత 20 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. సాగునీటి వసతులు లేకపోవడంతో పాటు వర్షాలు సక్రమంగా కురవక పంటలు ఎండిపోతున్నాయని, దీంతో గిరిజన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు సబ్సిడీపై ఎరువులు, వ్యవసాయ యంత్రాలు అందించడంతో పాటు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో సాగులో ఉన్న పలువురు గిరిజనులకు హక్కు పత్రాలు అందలేదని, దీంతో ప్రభుత్వ రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం పెనుబల్లి మండల కమిటీ సభ్యులు రాజినేని మంగమ్మ,వడ్డేగ బజారు, కుంజా రాములు, చిలక రమణమ్మ, కుంజా ఈదబాబు, కుంజా నరసమ్మ, పద్మ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
